- పవర్‌ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం.. ఎవ్వరూ ఏమీ చేయలేరనుకుంటున్నారు
- తమను తాము చాలా గొప్ప వారిగా, శక్తివంతులుగా భావిస్తున్నారు.. ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు
- ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు.. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- కేజీబీవీల్లో పీజీటీల బదిలీపై మండిపాటు
- సర్వశిక్ష అభియాన్ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్‌ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్ప వారిగా, కోర్టుకన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది.
కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంది. కేజీబీవీల్లో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్‌పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు... విద్యాశాఖలో ఏదీ కూడా సక్రమంగా జరగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను, అలాగే సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి.శ్రీనివాస్‌రావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయనకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాస్‌రావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచి్చంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు వివరాలు ఇవీ..
⇒ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు
చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
⇒ ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు గత ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు.
⇒ ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.
⇒ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.
⇒ ఈ అప్పీల్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
⇒ విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు.
⇒ పీజీటీల తరఫు న్యాయవాది జైభీమ్ రావు వాదనలు వినిపిస్తూ “ఒప్పందం ప్రకారం రిట్ పిటిషనర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగిస్తూ, వారికి ఆ మేర వేతనాలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సర్వశిక్షాభియాన్ అధికారులు మాత్రం పిటిషనర్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో పాటు నెలవారీ ఇచ్చే వేతనాన్ని పని గంటల ఆధారంగా చెల్లించేలా మార్పులు చేశారు. అంతేకాక సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తామంటూ ఈ కోర్టుకు ఇచ్చిన హామీని సైతం అధికారులు ఉల్లంఘించారు’ అని ధర్మాసనానికి విన్నవించారు.


