తెలంగాణలో మరో 16 ప్రాజెక్టులు!
కృష్ణా జలాలపై ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం
372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీకి గతేడాది సెప్టెంబరు 16న తెలంగాణ సర్కార్ అనుమతి
ఆ ఉత్తర్వులు తక్షణమే నిలిపివేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో కనీసం ఐఏ కూడా దాఖలు చేయని చంద్రబాబు సర్కారు
అదే సమయంలో.. పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ఆపాలంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
అనుమతి లేకుండా వడివడిగా నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు
చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, బాధ్యతా రాహిత్యానికి మరో నిదర్శనమిది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేందుకు 16 ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీకి గతేడాది సెపె్టంబరు 16న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లోగానీ సుప్రీం కోర్టులోగానీ సవాల్ చేయలేదు.
మరోవైపు శ్రీశైలం నుంచి పది టీఎంసీలు తరలించి 1.15 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కోసం రూ.2,945 కోట్లతో అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులతోపాటు తాగునీటి అవసరాల ముసుగులో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను యథేచ్ఛగా చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపకపోవడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు చంద్రబాబు సర్కార్ నీళ్లొదులుతున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు.
మొద్దు నిద్రలో బాబు సర్కారు..!
కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలు.. 65 శాతం, సరాసరి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 194 టీఎంసీల మిగులు జలాలు వెరసి 1,005 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడంపై ప్రస్తుతం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోంది. పరీవాహక ప్రాంతం (బేసిన్) ప్రాతిపదికగా తమకు 904 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కార్ తుది వాదనలు వినిపించింది.
ఈ క్రమంలో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి.. ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా, కొత్తగా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్‌ల (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత సెపె్టంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేటాయింపులు చేయకుండానే 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని.. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఐఏ (ఇంటర్ లొకేటరీ అప్లికేషన్) దాఖలు చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై నివ్వెరపోతున్నారు. ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యానికి, చిత్తశుద్ధి లోపానికి అద్దం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేస్తున్నారు.
మన హక్కులకు నీళ్లొదిలి..!
విభజన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా 120 టీఎంసీలను తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సుంకేశుల బ్యారేజీ గర్భం నుంచి తుంగభద్ర జలాలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల.. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంచి.. భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టినా.. ఓటుకు కోట్లు కేసు భయంతో నాటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది.
అనంతరం 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం చేసింది. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టింది. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలు తమకే దక్కుతాయని, వాటితోపాటు చిన్న నీటిపారుదల విభాగంలో 45 టీఎంసీల మిగులు ఉందని.. వెరసి ఆ 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడంపై అప్పట్లో వైఎస్సార్‌సీపీ సర్కార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఐఏ దాఖలు చేసి, దాన్ని అడ్డుకుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ సర్కార్ 372.54 టీఎంసీల
కృష్ణా జలాల తరలింపునకు డీపీఆర్ తయారీకి అనుమతి ఇచి్చన ప్రాజెక్టులు ఇవే..
1. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు
2. గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 1.32 నుంచి 10 టీఎంసీలకు పెంపు
3. నెట్టెంపాడు ఎత్తిపోతల రెండో దశలో మరో 4 టీఎంసీలు తరలింపు
4. 0.5 టీఎంసీల సామర్థ్యంతో బుజ్జితండా–భీమ తండా ఎత్తిపోతల
5. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం మరో 20.12 టీఎంసీలు పెంపు
6. జూరాల వరద కాలువ ద్వారా 100 టీఎంసీలు తరలించి 11.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం
7. కోయిల్‌కొండ–గండీడు ఎత్తిపోతల ద్వారా 123 టీఎంసీలు తరలింపు
8. కోయిల్‌సాగర్ ఎత్తపోతల సామర్థ్యం అదనంగా 3.30 టీఎంసీలు పెంపు
9. జయపురం వద్ద 2 టీఎంసీల సామర్థ్యంతో ఆకేరు బ్యారేజ్
10. విస్పంపల్లె వద్ద 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో ఆకేరు బ్యారేజ్
11. 1.3 టీఎంసీల సామర్థ్యంతో మున్నేరు బ్యారేజ్
12. గార్ల వద్ద మున్నేరుపై 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్
13. డోర్నకల్ మండలం ముల్కపల్లి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
14. ఎద్దులచెర్వు వద్ద ఆకేరుపై 1.3 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్
15. శ్రీశైలం ఎడమగట్టు కాలువ విస్తరణలో భాగంగా 3.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సోమశిల వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
16. శ్రీశైలం నుంచి నీటిని తరలించి రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కోసం దేవులమ్మ నాగారం (పది టీఎంసీలు), దండు మైలారం (పది టీఎంసీలు), ఆరుట్ల (పది టీఎంసీలు సామర్థ్యంతో) రిజర్వాయర్ల నిర్మాణం.


