‘గోదావరి జల వివాదం’పై కూర్చుని మాట్లాడుకోండి..
తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు హితవు
చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
మధ్యవర్తిత్వం, సివిల్ సూట్ సహా 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించిన ప్రధాన న్యాయమూర్తి
నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ‘పోలవరం–నల్లమల సాగర్’ ప్రాజెక్టు చేపట్టిందన్న తెలంగాణ
సీడబ్ల్యూసీ వద్దన్నా ముందుకు వెళుతోందని, టెండర్లు కూడా పిలిచిందని వెల్లడి
తక్షణమే స్టే ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
ప్రస్తుతం పీఎఫ్‌ఆర్, డీపీఆర్ కోసం సర్వేలు, టెండర్ల ప్రక్రియ మాత్రమే చేపట్టామన్న ఏపీ
భవిష్యత్తులో ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలితే ప్రజాధనం వృ«థా అవుతుంది కదా అంటూ సీజేఐ వ్యాఖ్య
తదుపరి విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు.
పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్‌మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు.
మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ
సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ
ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం.
ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్‌ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు.
ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ
వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు.
మూడు పరిష్కార మార్గాలు
ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది.


