రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న భూమన అభినయ్‌రెడ్డి, భూమన సుబ్రమణ్యంరెడ్డి, మేయర్ శిరీష, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బాబు సర్కారుపై భగ్గుమన్న సీమ రైతులు
భూమన అభినయ్ ఆధ్వర్యంలో కదం తొక్కిన కర్షకులు
తిరుపతి కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయింపు.. నల్లచొక్కాలతో బిందెలు చేతబట్టి నిరసన
ఉద్యమకారులపై పోలీసుల జులుం... సాక్షి ఫొటోగ్రాఫర్‌పైనా దౌర్జన్యం
తిరుపతి అర్బన్/చంద్రగిరి: తెలుగు రాష్ట్రాల సీఎంలు, గురుశిష్యులు సీమను ఎడారిగా మార్చడానికి చీకటి ఒప్పందాలకు తెగబడ్డారని కర్షకులు కన్నెర్రజేశారు. చంద్రబాబు సర్కారుపై భగ్గుమన్నారు. ఎత్తిపోతారు తస్మాత్ జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల రక్షణలో భాగంగా రైతులు సోమవారం ఉద్యమబాట పట్టారు. సోమవారం తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డెక్కారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బైఠాయించి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు అండగా రాయలసీమ ఉద్యమకారుడు, శ్వేత మాజీ డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మద్దతుగా నిలిచారు.
‘చంద్రబాబు నోరు విప్పు–సీమ ప్రజలకు సమాధానం చెప్పు’ అనే నినాదంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద నల్ల చొక్కాలు ధరించి, ఖాళీ బిందెలను చేతపట్టుకుని నిరసన గళం వినిపించారు. ప్లకార్డులతో సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శిష్యుడు రేవంత్‌రెడ్డి మీకు వెన్నుపోటు పొడిచారా...? లేదా ఇద్దరూ కలసి సీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారో స్పష్టంగా ప్రజలకు చెప్పాలంటూ నినదించారు.
ఆ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తడంతో పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. జులుం ప్రదర్శించారు. మహిళలపైనా దురుసుగా ప్రవర్తించారు. లాగిపక్కన పడేశారు. ఈ సందర్భంగా జై జగన్... నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.
సీమ ద్రోహి సీఎం చంద్రబాబు
రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు... అంటూ వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి మండిపడ్డారు. సైంధవుడు వలే చంద్రబాబు సీమ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంల చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్రాయలసీమ–ఎత్తిపోతల పథకానికి రూ.7వేల కోట్లు కేటాయింపులు చేసి శ్రీశైలం, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని అందించాలని సంకల్పించారని గుర్తుచేశారు.
ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవం పోస్తుందని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు లేకపోవడంతోనే మదనపల్లె, తంబళ్లపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి పుణెకు రైతులు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని పేరుతో అమరావతి భూములు లాక్కున్నట్లుగా ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి సీమను ఎడారిగా మార్చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీమకు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని, రైతుల్లో రగిలిన చైతన్యస్ఫూర్తితో మహోద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ప్రజల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా..? : ఎంపీ మద్దిల గురుమూర్తి
ప్రజల హక్కులను కాపాడేందుకు శాంతియుత నిరసన చేస్తున్న ఉద్యమకారులను అడ్డుకోవడమే కాకుండా, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద భూమన అభినయ్‌రెడ్డితోపాటు రైతులను పోలీçÜులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న గురుమూర్తి వెంటనే తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
పోలీసుల అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే అభినయ్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం తిరుచానూరు పోలీసులు భూమన అభినయ్‌తోపాటు 29మందిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల దౌర్జన్యం
విధినిర్వహణలో భాగంగా రైతుల శాంతియుత నిరసన, ఉద్యమకారుల అక్రమ అరెస్టులకు సంబంధించిన ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మోహన్‌కృష్ణపై మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ వద్ద మెడపట్టి బయటకు లాగేశారు. దీంతో మోహన్‌కృష్ణ, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆగ్రహించిన సీఐ సునీల్‌కుమార్ స్టేషన్‌లో ఉన్న ఫొటోగ్రాఫర్‌ను నెట్టుకుంటూ వచ్చి బయటకు తోసేశారు.
ఆపై డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో మోహన్‌కృష్ణను పోలీసులు స్టేషన్‌లో రెండు గంటలకుపైగా నిర్బంధించారు. సమాచారం అందుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డీఎస్పీతో మాట్లాడారు. పోలీసు చర్యలను ఖండించారు. ఫలితం లేకపోవడంతో విషయాన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు.


