సాక్షి, అమరావతి: కొమెరీన్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బుధవారం లక్షద్వీప్ దీవులకు సరిహద్దున ఉన్న మాల్దీవుల వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని తెలిపింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడుతున్నాయని వెల్లడించింది. మరోవైపు ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందన్నారు.
జి.మాడుగులలో కనిష్ట ఉష్ణోగ్రత..
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, కిలగడలో 5.8, డుంబ్రిగూడ 7.8, కరిముక్కిపుట్టి 8, పాడేరు 8.1, అరకు, పెదబయలు 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


