‘భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్‌ చోరీ’ | Kk Raju Slams On Chandrababu Credit Chor On Bhogapuram Airport | Sakshi
Sakshi News home page

‘భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్‌ చోరీ’

Jan 6 2026 7:22 PM | Updated on Jan 6 2026 7:55 PM

Kk Raju Slams On Chandrababu Credit Chor On Bhogapuram Airport

సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్‌ జగన్‌ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు  ఆ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.

ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్‌ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్‌ సిద్ధం కాలేదని, రోడ్‌ అలైన్‌మెంట్‌కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఏం మాట్లాడారంటే..:

తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:
ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్‌ రన్‌ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్‌ తదితరులు క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.

జగన్‌ వల్లనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌:
2019లో జగన్‌ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్‌పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్‌వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్‌ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్‌ ఫ్రేమ్‌ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్‌ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్‌ చొరవతో వైజాగ్‌ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.

ఎయిర్‌పోర్టుకు రోడ్‌ కనెక్టివిటి ఏదీ?:
ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు పక్కా రోడ్‌ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఏం సమాధానం చెబుతారు?.

ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్‌లో తీవ్ర ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్, డీపీఆర్, అలైన్‌మెంట్‌ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement