ఎంబీబీఎస్ సీట్లు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం
విద్యార్థుల పాలిట పెనుశాపంగా చంద్రబాబు పాలన
సీట్లు రాబట్టేలా ప్రభుత్వ పెద్దలు కనీసం చొరవ చూపని దుస్థితి
గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల అనుమతుల విషయంలో సీఎం స్థాయిలో ప్రత్యేక దృష్టి
చంద్రబాబు వైఖరితో రెండేళ్లలో నష్టపోయిన 2,450 మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: బాబు సర్కారు నిర్లక్ష్యం కారణంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండాపోయాయి. ఉత్తరాంధ్రలోని గిరిజనులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతోపాటు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పిన విషయం తెలిసిందే.
150 ఎంబీబీఎస్ సీట్లతో 2024–25 విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభించేందుకు వీలుగా గత ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలల్ని పీపీపీ పేరిట ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పాడేరు కళాశాలను గాలికి వదిలేసింది. అయినప్పటికీ వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా 50 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదే కళాశాలకు మరో 100 సీట్లు సమకూరాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి 50 సీట్లకు అనుమతి కోసం పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి, సీట్లు రాబట్టే బాధ్యతను కళాశాల, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)పై నెట్టేసి ప్రభుత్వం పెద్దలు చేతులు దులిపేసుకున్నారు.
వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ
గత ప్రభుత్వంలో వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టడంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా చొరవ చూపారు. 2023–24లో నాలుగు వైద్య కళాశాలలకు కొన్ని కారణాలతో తొలుత ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైద్యశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీఎంఈ సహా పలువురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు.
ఆ ఏడాది ఐదు కళాశాలల్లో దరఖాస్తు చేసిన వంద శాతం సీట్లకు అనుమతులు రాబట్టారు. వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒకే ఏడాది ఏకంగా 750 సీట్లను రాష్ట్రానికి సమకూర్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలున్న అనుకూల పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు చొరవ చూపకపోవడం వల్ల 50 సీట్లు కూడా రాష్ట్రానికి సమకూరకుండా పోయాయి.
వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో 10 కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం రెండేళ్లలో 1750 కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 సీట్ల చొప్పున 2,450 మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కాగా.. వారి భవిష్యత్ తలకిందులైంది.
కనీసం చొరవ చూపని ప్రభుత్వం
ఈ ఏడాది మే నెలలో సీట్ల మంజూరులో పలు అభ్యంతరాలను ఎన్‌ఎంసీ వ్యక్తపరిచింది. వాటికి ప్రిన్సిపల్ వివరణ ఇవ్వగా, పరిశీలనలోకి తీసుకోలేదు. ఆగస్టులో సీట్లు మంజూరు చేయలేమని తేల్చేసి లెటర్ ఆఫ్ డిస్‌అప్రూవల్‌ను ఎన్‌ఎంసీ జారీ చేసింది. దీంతో మొదటి అప్పీల్‌కు ప్రిన్సిపల్ దరఖాస్తు చేశారు. అప్పీల్ సందర్భంగా కొన్ని పొరపాట్లు దొర్లడంతో దానిని తిరస్కరించినట్టు ఎన్‌ఎంసీ ఈ నెల మొదటి వారంలోనే తేల్చేసింది. గత వారంలో ప్రిన్సిపల్ సెకండ్ అప్పీల్ చేశారు.
ప్రారంభంలోనే దరఖాస్తును ఎన్‌ఎంసీ నిరాకరించింది. మొదటి అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకోనేలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఈ వ్యవహారంలో చొరవ చూపలేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ ప్రకారం గురువారం అర్ధరాత్రితో 2025–26 ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనుమతులు రాబట్టడంలో ప్రిన్సిపల్‌ను బాధ్యుల్ని చేస్తూ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వైద్యశాఖలో చర్చనీయాంశంగా మారింది.


