బెంగళూరు: బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్ కుమార్ మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అవతార మెత్తారు. నగరంలోని భాష్యం సర్కిల్ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే’అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు.
ట్రాఫిక్ పోలీసు జాకెట్ ధరించిన ఆయన, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పనిచేశారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ట్రాఫిక్ నిర్వహించడంతోపాటు వారితో సంభాషించారు. సిగ్నల్ కంట్రోల్ పోస్ట్‌ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఒక రోజు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పనిని నేను ఆస్వాదించాను. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఈ చొరవ స్వాగతించదగినది.’ అని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇక నుంచి ప్రతి సోమవాకం ఒక గంట పాటు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
‘ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా? వాటికి ఎలా స్పందిస్తున్నారు? వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఇది జీవితంలో మంచి అనుభవం’ ఓ వీడియోలో పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ఏఎస్‌టీఆర్‌ఏఎమ్’ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది.


