మార్గశిర మాసోత్సవాలకు ఏర్పాట్లు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి ఆలయంలో జరగనున్న మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆమె ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నద్ధమైనట్లు ఈవో శోభారాణి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా డిసెంబర్ 7న వేద సభ, అర్చక సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 13న అమ్మవారి రథయాత్ర, 18న ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా మధ్యాహ్నం 12 గంటలకు మహాన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అన్నదానం తరువాత సాయంత్రం 4 గంటలకు సహస్ర ఘటాభిషేకం, ఇతర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.


