మరణానంతరం ఐదుగురి జీవితాలకు కొత్త వెలుగులు
ఆరిలోవ: తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ ఇతరుల కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలని అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి అందరి చేత ఆ కుటుంబం అభినందనలు పొందుతోంది. విశాఖలోని ఎండాడకు చెందిన ఆటో డ్రైవర్ బొబ్బిలి రమేష్ (51) తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. తన నివాసం పైనుంచి ఈనెల 10వ తేదీన ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. దీంతో తలలో తీవ్ర రక్తస్రావం అయ్యింది. చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులను తీసుకెళ్లినప్పటికీ రక్తస్రావం నియంత్రణలోకి రాలేదు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్య బృందం మంగళవారం ప్రకటించింది. కాగా వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అవయవదానం గురించి అవగాహన కల్పించింది. వారు అంగీకారం తెలపడంతో ఈ సమాచారాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన అవయవాలను స్వీకరించేందుకు అనుమతులను జారీ చేశారు. అనంతరం బ్రెయిన్‌డెడ్ అయిన రమేష్ నుంచి లివర్, కిడ్నీలు, కార్నియా స్వీకరించారు. జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్టును అనుసరించి అవయవాలను పలు ఆసుపత్రులకు కేటాయించారు.


