ఘనంగా కెనరా బ్యాంక్ 120 వ్యవస్థాపక దినోత్సవం
విశాఖ సిటీ: కెనరా బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం సిరిపురం జంక్షన్‌లోని కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్యాంక్ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబాల్ సుబ్బారావు చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సుబ్బారావు సేవలు ఎనలేనివని, ఆయన దూరదృష్టి, నిబద్ధత స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. దేశంలోని అతి పెద్ద, విశ్వసనీయ బ్యాంకుల్లో ఒకటిగా కెనరా బ్యాంక్ ఎదగడానికి ఆయన వేసిన పునాది ప్రధాన కారణమన్నారు. 120 ఏళ్ల ప్రయాణంలో కస్టమర్ల విశ్వాసం, సేవా భావం, పారదర్శకతను కెనరా బ్యాంక్ నిలబెట్టుకుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఏజీఎం మధుసూదన్‌రెడ్డి, డివిజనల్ మేనేజర్లు ప్రతాప్ కుమార్, ముత్యాల రమణ, రీజినల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.


