ఏయూ హాస్టళ్లలో వికృత చేష్టలు
విదేశీ విద్యార్థుల హాస్టల్‌లో మద్యం వ్యవహారంతో మరోసారి వెలుగులోకి..
గతంలో శాతవాహన హాస్టల్‌లో మద్యం మత్తులో విద్యార్థుల కొట్లాట
హాస్టళ్లలో వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
విశ్వవిద్యాలయంలో లోపిస్తున్న క్రమశిక్షణ
శతాబ్ది వేడుకల వేళ.. మసకబారుతున్న ప్రతిష్ట
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో వరుస పరిణామాలు ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ప్రధానంగా ఏయూ వసతి గృహాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు హాస్టళ్లలో భోజనం, సదుపాయాలపై విద్యార్థులు రోడ్డెక్కారు. తాజాగా విదేశీ విద్యార్థిని మద్యం తాగాలని సహచర విద్యార్థులు బలవంతం చేయడం వంటి వికృత చేష్టలు బయటపడ్డాయి. దీనిపై బంగ్లాదేశ్‌కు చెందిన సదరు విద్యార్థి ఏకంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సమక్షంలో ఫిర్యాదు చేస్తే గాని అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
హాస్టళ్లపై పర్యవేక్షణ లోపం
ఏయూలో 40కిపైగా వసతి గృహాలు ఉన్నాయి. వీటిపై ఏయూ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రతీసారి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హాస్టళ్లలో కనీస సదుపాయాలు, విద్యార్థులకు సరైన భోజనాల విషయంలో కూడా అధికారులు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. పురుగుల భోజనాలు, నీళ్ల సాంబారు, ఉడకని అన్నం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. హాస్టళ్లలో భోజనాలు బాగోలేవని విద్యార్థులు ఇటీవల ఏయూ వీసీ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో నేరుగా వీసీ వచ్చి వారికి సర్ధిచెప్పాల్సి వచ్చింది. అలాగే మహిళా ఇంజనీరింగ్ హాస్టల్‌లో నీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శాతవాహన హాస్టల్ విద్యార్థికి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కూడా ఆక్సిజన్ పెట్టేవారు లేక మరణించాడంటూ మరోసారి విద్యార్థులు రోడ్డెక్కారు. ఇలా ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు హాస్టల్స్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
వసతి గృహాల్లో మద్యం కలకలం
ఏయూ వసతి గృహాల్లో మద్యం వార్తలు కలకలం రేపుతున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థిని మద్యం తాగాలని బలవంతం చేయడం, తాగనందుకు దాడి చేసిన వ్యవహారం ఇప్పుడు ఏయూలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు విద్యార్థి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఏయూలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ హరేందిరప్రసాద్, కమిషనర్ శంఖబ్రత బాగ్చిల సమక్షంలోనే ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. గతంలో కూడా శాతవాహన హాస్టల్‌లో మద్యం మత్తులో విద్యార్థులు కొట్లాటకు దిగిన సందర్భాలు ఉన్నాయి. హాస్టళ్లలో పరిస్థితులపై విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. వార్డెన్లు గానీ, ఏయూ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో కొంత మంది మరింత పెచ్చు మీరుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏయూ వసతి గృహాల్లో పరిస్థితులు బయటకు వస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే హాస్టళ్లలో మద్యం, ఇతర వివాదాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక కమిటీ ఎక్కడ?
ఏయూ వసతి గృహాల్లో బయటి వ్యక్తులు లేకుండా, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లు రాకుండా, ర్యాంగింగ్ ఫ్రీ క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఏయూ పాలకులు గతంలో పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్సిటీలో ఉన్న అన్ని వసతి గృహాల్లో నిత్యం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో కొన్ని హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే మత్తు పదార్థాలు యూనివర్సిటీలోకి వస్తున్నట్లు తెలుసుకున్నారు. వాటికి చెక్ పెట్టేందుకు కళాశాలల ప్రిన్సిపాళ్లు, హాస్టల్స్ వార్డెన్లతో కలిపిన బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ బృందం ఏమైందన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లలో తనిఖీలు తగ్గిపోయాయి. ఒకటి, రెండు చోట్ల సందర్శనలు చేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో కొన్ని హాస్టళ్లలో కొందరు విద్యార్థులు శృతిమించుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.


