సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం కాలువలో పసికందు మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీ కొనసాగుతోంది. తల లేకుండా విడి భాగాలు మాత్రమే లభించడం స్థానికంగా కలకలం రేపింది. ఆ చిన్నారి ఎవరు? ఎందుకు అంత ఘోరంగా చంపారు?.. అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
గురువారం ఉదయం కంచరపాలెం పీఎస్ పరిధిలోని.. ఓ కాలువలో పసికందు శరీర విడిభాగాలు కనిపించాయి. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్ళు, చేతులు ముక్కలుగా లభ్యం కాగా.. తల భాగం కోసం పోలీసులు కాలువలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు జరిపారు. మరోవైపు.. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది.
పసికందు శరీర బాగాల నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశీలనకు తీసుకెళ్లింది. మరోవైపు.. శరీర భాగాలను కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆశా వర్కర్స్ ద్వారా గర్భిణీల వివరాలను పరిశీలిస్తున్నారు. అపహరణ కేసులు ఏమైనా నమోదు అయ్యాయో రికార్డులు పరిశీలిస్తున్నాయి. అమవాస్య కావడంతో నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.


