భారీగా పెరిగిన వెయిటింగ్ లిస్ట్
అదనంగా 150 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ): తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ప్లాట్‌ఫాంలు కిటకిట..
సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కశాశాలలకు సెలవులు రావటంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుండటంతో అన్ని ప్లాట్‌ఫాంలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి, ఆరు, ఏడు ప్లాట్‌ఫాంలలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ, పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తుండటంతో ప్లాట్‌ఫాంలు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులలో చార్జీలు రెట్టింపు వసూలు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్ రైళ్లు నెలరోజుల కిత్రమే నిండిపోయి భారీగా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయింది. దీంతో రైల్వేఅధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడ మీదుగా 150 ప్రత్యేక రైళ్లు..
హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు.


