సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్ చెబుతుండగా.. ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు.
మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు.
పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?. ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్‌రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు.

అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.


