స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌ను పాకిస్తాన్ విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాక్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (36 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సికందర్ రజా (24 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మరుమని (22 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.
పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా, సల్మాన్ మీర్జా, సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి విజయం సాధించింది.
ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (12 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (22; 1 ఫోర్, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (1), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్‌కు భారత్


