ఒమన్‌పై 6 వికెట్లతో గెలుపు
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వసీమ్ అలీ (45 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా... కెపె్టన్ హమ్మద్ మీర్జా (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.
భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో గుర్‌జపనీత్ సింగ్, సుయాశ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్ వైశాక్, హర్‡్ష దూబే, నమన్ ధిర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ష్ దూబే (44 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా... నమన్ ధీర్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ షాట్‌లతో అలరించాడు. ఐపీఎల్ స్టార్‌లు వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాన్ష్ ఆర్య (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. నేహల్ వధేరా (23) ఫర్వాలేదనిపించాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లతో భారత ‘ఎ’ జట్టు ముందంజ వేసింది.


