హాకీ ఇండియా లీగ్
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్‌లో తమకు కాంస్య పతకాన్ని దూరం చేసిన సూర్మ హాకీ క్లబ్‌ను ఓడించింది. మంగళవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 3–2 స్కోరుతో సూర్మ హాకీ క్లబ్‌పై విజయం సాధించింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ లేకుండానే ఈ క్వార్టర్ ముగిసింది. రెండో క్వార్టర్ మొదలయ్యాక కూడా గోల్‌పోస్ట్‌పై పరస్పర దాడులే తప్ప గోల్ మాత్రం కాలేదు.
ఎట్టకేలకు రెండో క్వార్టర్ ముగిసే దశలో సెల్వరాజ్ కనగరాజ్ (28వ ని.) గోల్ చేసి తమిళనాడుకు 1–0తో ఆధిక్యాన్నిచ్చాడు. రెండు నిమిషాల వ్యవధిలోనే ఉత్తమ్ సింగ్ (30వ ని.) గోల్‌తో ఈ ఆధిక్యం కాస్త 2–0తో రెట్టింపైంది. మూడో క్వార్టర్‌లో సూర్మ క్లబ్ ఆటగాళ్లు స్కోరు చేసేందుకు శతవిధాల ప్రయతి్నంచారు. క్షణాల్లో మూడో క్వార్టర్ ముగుస్తుండగా మణిందర్ సింగ్ (45వ ని.) గోల్ చేసి సూర్మ ఖాతా తెరిచాడు.
కానీ ఆఖరి క్వార్టర్ మొదలవగానే బ్లేక్ గోవర్స్ (47వ ని.) గోల్ చేయడంతో డ్రాగన్స్ 3–1తో తిరుగులేని పైచేయి సాధించింది. అనంతరం సూర్మ క్లబ్ ఆటగాళ్లు గోల్స్ కోసం ఎంతగా శ్రమించినా లాభం లేకపోయింది. ఎట్టకేలకు 58వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో తమిళనాడు ఆధిక్యాన్ని 3–2తో తగ్గించగలిగిందే కానీ ప్రత్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయింది. రాంచీలో జరిగిన మహిళల హెచ్‌ఐఎల్‌లో శ్రాచి బెంగాల్ టైగర్స్ షూటౌట్‌లో 7–6తో ఎస్‌జీ పైపర్స్‌పై గెలుపొందింది. బుధవారం జరిగే మహిళల పోటీలో బెంగాల్ టైగర్స్‌తో సూర్మ హాకీ క్లబ్ తలపడుతుంది. పురుషుల మ్యాచ్‌లో హెచ్‌ఐఎల్ జీసీతో బెంగాల్ టైగర్స్ పోటీ పడుతుంది.


