వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్‌లో జన్మించిన వారే.
ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్‌గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్‌లో ఒమన్ డిప్యూటీ కోచ్‌గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.
2026 టీ20 వరల్డ్‌కప్ కోసం ఒమన్ జట్టు..
జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా
కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్‌కప్‌కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది.
ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్‌లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


