రాణించిన బౌలర్లు, ఫర్హాన్‌.. శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్‌ | Farhan, bowlers shine as Pakistan take 1-0 lead | Sakshi
Sakshi News home page

రాణించిన బౌలర్లు, ఫర్హాన్‌.. శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్‌

Jan 8 2026 7:30 AM | Updated on Jan 8 2026 11:37 AM

Farhan, bowlers shine as Pakistan take 1-0 lead

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ గెలుపుతో బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 7) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత ఓపెనింగ్‌ బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ రాణించడంతో పాక్‌ తిరుగులేని విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌ 19.2 ఓవర్లలోనే శ్రీలంకను ఆలౌట్‌ చేసింది. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంకేయులు 128 పరుగులకే చాపచుట్టేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ సల్మాన్‌ మీర్జా, స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ తలో 3 వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్‌ వసీం జూనియర్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు తీసి సత్తా చాటారు. లంక ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ జనిత్‌ లియనాగే (40) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక 12, కమిల్‌ మిషారా 0, వికెట్‌ కీపర్‌ కుసాల్‌ మెండిస్‌ 14, ధనంజయ డిసిల్వ 10, చరిత్‌ అసలంక 18, వనిందు హసరంగ 18, దసున్‌ షనక 12, దుష్మంత చమీరా 0, మహీశ్‌ తీక్షణ 1 పరుగుకు ఔటయ్యారు. శ్రీలంక చివరి 5 వికెట్లు 18 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (51), సైమ్‌ అయూబ్‌ (24) శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (16), ఫకర్‌ జమాన్‌ (5) విఫలమైనా, ఉస్మాన్‌ ఖాన్‌ (7 నాటౌట్‌), షాదాబ్‌ ఖాన్‌ (18 నాటౌట్‌) పాక్‌ను విజయతీరాలకు చేర్చారు. 16.4 ఓవర్లలో పాక్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, ధనంజయ డిసిల్వకు తలో వికెట్‌ దక్కింది. సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా జనవరి 9న జరుగనుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement