స్వదేశంలో ఇవాళ (నవంబర్ 18) ప్రారంభమైన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. రావల్పిండి వేదికగా పసికూన జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ తొలుత ఇబ్బంది పడింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (49), తదివనషే మరుమణి (30) జింబాబ్వేకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. ఆతర్వాత పాక్ బౌలర్లు లైన్‌లోకి రావడంతో జింబాబ్వే పతనం మొదలైంది. ఓ పక్క పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో కెప్టెన్ సికందర్ రజా (34 నాటౌట్) ఒంటిపోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించింది.
ఓపెనర్లు బెన్నెట్, మరుమణి, సికందర్ రజాతో పాటు జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రెండన్ టేలర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ర్యాన్ బర్ల్ (8), టోనీ మున్యోంగా (3), తషింగ ముసేకివా (2), బ్రాడ్ ఈవాన్స్ (2), టినోటెండా మపోసా (1), రిచర్డ్ నగరవ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (4-0-22-2), అబ్రార్ అహ్మద్ (4-0-28-1), సైమ్ అయూబ్ (4-0-31-1), షాహీన్ అఫ్రిది (4-0-34-1), సల్మాన్ మీర్జా (3-0-21-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలుత వీరంతా ధారాలంగా పరుగులు సమర్పించుకున్నా, ఆతర్వాత కుదురుకున్నారు.
ముఖ్యంగా అబ్రార్, నవాజ్ జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ టోర్నీలో పాక్, జింబాబ్వేతో పాటు శ్రీలంక పాల్గొంటుంది.


