కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మెడ గాయం కారణంగా కెప్టెన్ గిల్ (Shubman Gill) సేవలను ఉన్నపళంగా కోల్పోయిన భారత జట్టు.. మ్యాచ్‌ను కూడా అత్యంత అవమానకర రీతిలో చేజార్చుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని టీమిండియా బొక్కబోర్లా పడి, ఘోర అపవాదును మూటగట్టుకుంది.
తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన గిల్.. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తొలి టెస్ట్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.
ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. మైదానం నుంచి గిల్‌ను నేరుగా వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్సనందించారు.
సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!
ఇదే ఆసుపత్రిలో సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కూడా మ్యాచ్ అనంతరం చికిత్సనందించారని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్రధారులైన సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందారని సమాచారం.
హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతూ సదరు ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తుంది. ఈ గాయాల తాలుకా అధికారిక సమాచారమైతే ఇప్పటివరకు లేదు. ఒకవేళ నిజంగా హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు తగిలినట్లే.
కోల్‌కతా టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా అతినికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జన్సెన్ కూడా తొలి టెస్ట్‌లో సత్తా చాటాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు తీసి టీమిండియా పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకవేళ ఈ ఇద్దరు రెండో టెస్ట్‌కు దూరమైతే, సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బలు తగిలనట్లవుతుంది.
వీరికి ప్రత్యామ్నాయాలుగా సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ ఉన్నా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు లేకపోవడం సౌతాఫ్రికాకు పెద్ద లోటే అవుతుంది.
చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్‌కే


