ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను వదులుకున్న ఆ జట్టు (ట్రేడింగ్).. ఊహించని విధంగా పేస్ సంచలనం మతిష పతిరణను (Matheesha Pathirana) వేలానికి వదిలేసింది.
2022 ఎడిషన్‌లో సీఎస్‌కే తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన పతిరణ.. ఆ మరుసటి సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత కూడా ఎల్లో ఆర్మీ తరఫున విశేషంగా రాణించిన పతిరణ, గత సీజన్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
ఈ కారణంగానే సీఎస్‌కే యాజమాన్యం 'బేబీ మలింగ'ను వేలానికి వదిలేసిందని అంతా అనుకున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ తాజాగా స్పష్టం చేశారు.
జట్టు వ్యూహాల్లో భాగంగా పతిరణను వదులుకోక తప్పలేదని వివరణ ఇచ్చారు. పర్సు బరువు పెంచుకోవడం కోసం ఈ నిర్ణయం తప్పలేదని అన్నారు. పతిరణను వేలంలో తిరిగి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలిపారు.
పతిరణ విడుదలతో రూ. 13 కోట్లు ఖాళీ అవుతాయని, జట్టును బలంగా నిర్మించడానికి పెద్ద పర్సు అవసరమని, అందుకే పతిరణను విడుదల చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
పతిరణ విడుదలతో సీఎస్‌కే పర్సు విలువ రూ. 43 కోట్లకు చేరింది. దీంతో కేకేఆర్ తర్వాత వేలంలో పాల్గొనబోయే అతి విలువైన జట్టు సీఎస్‌కేనే అవుతుంది. ప్రస్తుతం కేకేఆర్ వద్ద రూ. 64 కోట్లు ఉండగా.. సీఎస్‌కే వద్ద రూ. 43 కోట్లు ఉన్నాయి.
కాగా, తాము విడుదల చేసిన పతిరణను తిరిగి పొందడం సీఎస్‌కేకు అంత సులువైన పని కాదు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన అతడి కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి. సీఎస్‌కే ఏ వ్యూహంతో (తక్కువ ధరకు పొందాలని) అయితే పతిరణను విడుదల చేసిందో, ఆ వ్యూహం బెడిసికొట్టవచ్చు.
చదవండి: హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్


