పాకిస్తాన్ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిపై విండీస్ స్టార్ క్రికెటర్, ఆ దేశ మాజీ కెప్టెన్, టీ20 స్పెషలిస్ట్ జేసన్ హోల్డర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల హోల్డర్ Game On with Grace అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్–పాకిస్తాన్ బీఫ్ (వివాదం) నాకిష్టం లేదని అన్నాడు. అలాగే టీమిండియా ఆసియా కప్ 2025 ట్రోఫీని స్వీకరించకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు.
హోల్డర్ ఈ వ్యాఖ్యలు అవగాహన లేమితో చేసినట్లు తెలుస్తున్నప్పటికీ.. అతను భారతీయ క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు. ఫలితంగా తన ఐపీఎల్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో హోల్డర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.
మంచి ఆఫర్ అనుకునేలోపే హోల్డర్ అనవసర విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నాడు. దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించని భారత క్రికెట్ అభిమానులు హోల్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ ఎదుర్కొన్న నష్టమే హోల్డర్ కూడా ఎదుర్కొనే ప్రమాదముంది.
వాస్తవానికి హోల్డర్ తన వ్యాఖ్యల్లో భారత్‌పై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అయినా ఇది భారత క్రికెట్ అభిమానులకు నచ్చదు. ఫలితం అక్కడ ఉన్నది ఎంతటి స్టార్ అయినా మూల్యం చెల్లించుకోకతప్పదు. బంగ్లాదేశీ ఆటగాడిని హైర్ చేసుకున్నాడని తమ ఆరాధ్య హీరోనే వ్యతిరేకించిన ఘన చరిత్ర మన భారత క్రికెట్ అభిమానులది. కాబట్టి హోల్డర్ విషయంలో కూడా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తప్పేలా లేదు.
ఈ నేపథ్యంలో సదరు ఫ్రాంచైజీ పరిశీలించబోయే హోల్డర్ ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేద్దాం. హోల్డర్ పొట్టి ఫార్మాట్‌లో అత్యంత ప్రభావితమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న వాటిలో గుజరాత్ పరిశీలించే అవకాశం ఉన్న ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో ముఖ్యుడు, ప్రథముడు ఎవాన్ జోన్స్.
ఎవాన్ జోన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున 182 స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన పవర్‌హిట్టర్.హోల్డర్‌లాగే భారీకాయుడైన జోన్స్ డెత్ ఓవర్లలో 233 స్ట్రైక్‌రేట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చే సామర్థ్యం ఉన్న ఆటగాడు.
ప్రస్తుత దేశవాలీ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి మంచి ఊపుమీద ఉన్న జోన్స్, హార్డ్‌లెంగ్త్ బౌలింగ్‌తో అహ్మదాబాద్ పిచ్‌లకు సరిపోయే బౌలర్.
అయుష్ వర్తక్
ఈ ముంబై యువ ఆల్‌రౌండర్ అండర్-23 విభాగంలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. 169.62 స్ట్రైక్‌రేట్‌తో లోయర్ ఆర్డర్ హిట్టర్‌గా మంచి పేరుంది. స్వల్ప కెరీర్‌లోనే 26 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్‌తో పాటు సీమ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు.
మనిశంకర్ మురసింగ్
ఈ త్రిపుర ఆల్‌రౌండర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు. 21 సిక్సర్లు సహా 46.16 సగటున, 172.04 స్ట్రైక్‌రేట్‌తో 277 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 7.6 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. మనిశంకర్ బ్యాట్‌తో పాటు బంతితోనూ ప్రభావం చూపగల ఆటగాడు.


