మహిళల బిగ్‌బాష్ లీగ్-2025లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే (Caoimhe Bray) హ్యాట్రిక్ నమోదు చేసింది. తద్వారా WBBLలో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.
కావిమ్‌కు ముందు WBBLలో ఆరుగురు (నికోల్ బోల్టన్, గెమ్మ ట్రిస్కారి, అమీ సాటర్త్‌వైట్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, డార్సీ బ్రౌన్) హ్యాట్రిక్ సాధించారు. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కావిమ్ ఈ ఘనత సాధించింది. కావిమ్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లతో చెలరేగడంతో థండర్‌పై సిక్సర్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.
అత్యంత అరుదైన ప్లేయర్‌గా కావిమ్
ఇక్కడి వరకు అంతా బాగుంది. క్రికెట్‌లో చాలామంది బౌలర్లు హ్యాట్రిక్ సాధిస్తుంటారు. అయితే కావిమ్‌కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ అమ్మాయి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ఆస్ట్రేలియా అండర్-17 ఫుట్‌బాల్ జట్టులో ఆమె గోల్‌కీపర్‌గా రాణిస్తుంది. తద్వారా క్రికెట్‌తో పాటు మరో క్రీడలో సత్తా చాటుతున్న అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరింది.
కావిమ్ గాయం కారణంగా ఫుట్‌బాల్‌కు స్వల్ప విరామం ప్రకటించి, క్రికెట్‌వైపు మళ్లింది. ఈ క్రమంలో ఆమెకు సిడ్నీ సిక్సర్స్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఫ్రాంచైజీతో కావిమ్ మూడేళ్ల ఒప్పందంలో ఉంది. గత సీజన్‌లో బీబీఎల్ ఎంట్రీ ఇచ్చిని కావిమ్.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి, హ్యాట్రిక్ సహా 27 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 137 పరుగులు చేసింది.
ఈ ఎడిషన్ బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్ ప్రస్థానం ముగిసిన వెంటనే కావిమ్ మళ్లీ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆసీస్ మహిళ-ఏ లీగ్ టోర్నీలో న్యూకాసిల్ జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాల్సి ఉంది.
ప్రస్తుత ఆసీస్ జట్టులోని ఎల్లిస్ పెర్రీ కూడా ద్వంద క్రీడల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పెర్రీ 17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది.
2011 FIFA Women’s World Cupలో పెర్రీ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది. పెర్రీని ఆదర్శంగా తీసుకున్న కావిమ్ కూడా క్రికెట్, ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతుంది.
చదవండి: పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్ ఆయుధం


