పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో ఇవాళ (నవంబర్ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49), కెప్టెన్ సికందర్ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.
మరుమణి 10, బ్రెండన్ టేలర్ 11, ర్యాన్ బర్ల్ 18, మున్యోంగ డకౌట్, ముసేకివా 11, బ్రాడ్ ఈవాన్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్ తీశారు.
52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక (0), కుసాల్ మెండిస్ (6), కుసాల్ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్ (9) ఔట్ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ జరిగింది. నవంబర్ 18న జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.
బెన్నెట్ (49), మరుమణి (30), సికందర్ రజా (34 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.
లక్ష్య ఛేదనలో పాక్ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్ జమాన్ (44), ఉస్మాన్ ఖాన్ (37 నాటౌట్) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్ నవాజ్ (21 నాటౌట్) బ్యాట్‌తోనూ రాణించి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.


