
ఆసియాకప్-2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఐర్లాండ్ దిగ్గజం జాన్ మూనీని ఏసీబీ నియమించింది. దీంతో మళ్లీ ఆరేళ్ల తర్వాత అఫ్గాన్ కోచింగ్ సెటప్‌లోకి మూనీ తిరిగొచ్చాడు.
ఈ ఐరీష్ మాజీ పేసర్ ఇంతకుముందు 2018 నుండి 2019 వరకు అఫ్గాన్ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత షేన్ మెక్‌డెర్మాట్ అఫ్గాన్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగాడు. అతడు ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అఫ్గాన్ క్రికెట్ మళ్లీ మూనీకి పిలుపునిచ్చింది.
43 ఏళ్ల మూనీ ఐర్లాండ్ తరపున 91 మ్యాచ్‌లు ఆడాడు. 2007, 2011, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన ఐర్లాండ్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. అదేవిధంగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో కూడా ఐరీష్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి లెవల్ 3, 2, 1 కోచింగ్ సర్టిఫికెట్‌లను కలిగి ఉన్నాడు.
ఇక అఫ్గాన్ జట్టు విషయానికి వస్తే.. ఆసియాకప్-2025కు సన్నద్దమవుతోంది. అంతకంటే ముందు యూఏఈ-పాకిస్తాన్‌లతో రషీద్ సేన ట్రైసిరీస్ ఆడనుంది. ఇప్పటికే యూఏఈకు చేరుకున్న అఫ్గాన్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
కాగా ఆసియాకప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. రషీద్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ వ్యవహరించనున్నాడు. కాగా సెప్టెంబర్ 9న అబుదాబిలో జరిగే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో అఫ్గానిస్తాన్ తలపడనుంది.
ఆసియాకప్-2025కు అఫ్గాన్ జట్టు ఇదే
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ