లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. లక్నోలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటి 'హానికర' స్థాయికి చేరుకుంది.
దీంతో మొత్తంగా ఆరు సార్లు మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించిన అంపైర్‌లు.. చివరిసారిగా రాత్రి 9.25 సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ప్రణాళిక లోపం..!
వాతావరణంపై పూర్తి నియంత్రణ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో దీపావళి తర్వాత ఢిల్లీలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను కాలుష్యంగా కారణంగా బీసీసీఐ కోల్‌కతాకు మార్చింది.
అంటే బోర్డుకు అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈసారి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో బీసీసీఐ విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేదికలు ఉన్నప్పటికి లక్నోలోనే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతటి కాలుష్యంలో ఆడటం ఆటగాళ్లకు ప్రేక్షకులకు, అధికారులకు ప్రాణసంకటమే. ఈ మైదానంలో హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ భారత ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతటి చలిలో ఆడడం ఇదే తొలిసారి అని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.
ఇప్పటికైనా మారాల్సిందే..
భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. కోట్లాది మంది భావోద్వేగం. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు టిక్కెట్లు తీసుకుని మరి మైదానంకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవ్వడం చాలా బాధాకారం. ఇకనైనా బీసీసీఐ షెడ్యూలింగ్ చేసేటప్పుడు.. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వేదికలను ఎంపిక చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లకు దక్షిణ, పశ్చిమ భారత నగరాలు వేదికలగా ఉన్నాయి. ఒక్క మూడో టీ20 నార్త్ ఈస్ట్(అస్సాం)లో జరగనుంది. ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చే అవకాశముంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
ఇది రెండోసారి..
అంతర్జాతీయ క్రికెట్‌లో పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. 1998లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. ఆశ్చర్యకరంగా ఐదు రోజులూ ఆట సాధ్యం కాలేదు.
చదవండి: అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన


