నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌! | Shubman Gill Ruled Out Of Lucknow IND vs SA T20I: Report | Sakshi
Sakshi News home page

నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌!

Dec 17 2025 7:04 PM | Updated on Dec 17 2025 8:57 PM

Shubman Gill Ruled Out Of Lucknow IND vs SA T20I: Report

భారత్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పొగమంచు అంతరాయం కలిగించింది.  ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్‌ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమైనట్లు సమాచారం.

పేలవ ప్రదర్శన
కాగా ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్‌ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్‌.. నాటి నుంచి ఓపెనర్‌గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).

తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్‌ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాగా గిల్‌ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌లను యాజమాన్యం విడదీసింది.

సంజూను పక్కనపెట్టేసి మరీ..
అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ అతడికి గిల్‌ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్‌ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్‌ దూరమైనట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.

కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్‌.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్‌ కెప్టెన్‌ కాగా.. టీ20లలో సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement