లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20కు ముందు తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో వెంటనే అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నాలుగో టీ20కు బుమ్రా అందుబాటులో ఉండవచ్చని దూబే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినప్పటికి.. టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు. గత మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. క్వింటన్ డి కాక్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు.
టీమిండియా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది. లక్నో వంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీ మరోసారి కీలకంగా మారనున్నారు. బుమ్రా అందుబాటులోకి వస్తే రాణాపై వేటు పడే అవకాశముంది. మరోవైపు సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సౌతాఫ్రికా జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్ లిండే/కేశవ్, ఎంగిడీ, బార్ట్‌మన్.
భారత్
సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుభ్‌మన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి.
చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!


