టీమిండియా యువ ఓపెనర్, ముంబై స్టార్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మంగళవారం రాజస్తాన్‌తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ అనంతరం జైశ్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు.
దీంతో అతడిని వెంటనే పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు అతడికి స్కాన్లు నిర్వహించి 'అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్ (పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు తేల్చారు.అయితే జైశ్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అతడికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
అనారోగ్యంతోనే బ్యాటింగ్
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.
జైశ్వాల్ త్వరగా ఔటైనప్పటికి.. ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అజింక్య రహానె (72*), సర్ఫరాజ్ ఖాన్ (73) అద్భుత హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిపించినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ టోర్నీలో జైశ్వాల్ కూడా దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ జైశ్వాల్ శతక్కొట్టాడు.
చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!


