'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్‌కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్.. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో కోటీశ్వరుడుగా మారిపోయాడు.
ఎన్నో ఏళ్ల తన శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో రూ. 8.40 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి.
చివరికి ఢిల్లీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి టీమ్‌లోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్, యుద్వీర్ సింగ్ చారక్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన మూడవ కాశ్మీర్ పేసర్‌గా నబీ నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ఆకిబ్ నబీ ధార్ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.
ఎవరీ ఆకిబ్ నబీ..?
29 ఏళ్ల ఆకిబ్ నబీ.. బారముల్లా జిల్లాలోని క్రేరీ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. దీంతో నబీని డాక్టర్ చేయాలని తన తండ్రి కలలు కన్నాడు. ఆకిబ్ మాత్రం తన తన తండ్రి ఆశయానికి భిన్నంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణ సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చిన నబీ.. తన కఠోర సాధన, పట్టుదలతోనే ఈ స్ధాయికి చేరుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్‌లో చలికాలంలో క్రికెట్ ఆడటం చాలా కష్టం. అయినప్పటికి సిమెంట్ వికెట్లపై ప్రాక్టీస్ చేస్తూనే తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకున్నాడు. నబీకి అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు.
రంజీల్లో అదుర్స్..
నబీ 2020-21 రంజీ సీజన్‌లో జమ్ము కాశ్మీర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సీజన్‌లో నబీ పెద్దగా రాణించికపోయినప్పటికి.. గత రెండేళ్లగా మాత్రం దేశవాళీ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. 2024 రంజీ సీజన్‌లో 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. రంజీ సీజన్ 2025-26లో ఆకిబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా దార్ కొనసాగుతున్నాడు.
నబీకి బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నబీ రికార్డులెక్కాడు.
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆకిబ్ సత్తాచాటుతున్నాడు. 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. మిచెల్ స్టార్క్, నోర్జే వంటి స్పీడ్ స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను ఆకిబ్ షేర్ చేసుకోనున్నాడు.


