ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్‌లో పునరాగమనం చేయనున్నాడు.
ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
సర్ఫరాజ్ స్పందన ఇదే
సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్‌కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.
కాగా దేశవాళీ క్రికెట్‌లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు.
ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది.
కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.
అమ్ముడుపోని స్టార్లు వీరే
ఐపీఎల్‌లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్...
టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్‌హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు.
Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️
This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025


