భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer).
రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్ వీర్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ కోట్లాభిషేకం చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది.
అత్యధిక ధర
ఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.
కారణం ఇదే
ఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్ పంత్)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.
ఆసీస్ ఆల్‌రౌండర్ అయిన కామెరాన్ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి.
అత్యధిక పర్సు వాల్యూతో..
కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.
వీరితో పాటు తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.
ఐపీఎల్-2026కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇదే
అజింక్య రహానే, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, ముస్తఫిజుర్ రెహ్మాన్, తేజస్వి సింగ్ , రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్ , సీఫెర్ట్, ఆకాశ్‌దీప్, రాహుల్ త్రిపాఠి , కామ్రా , సార్థక్ రంజన్ , ప్రశాంత్ సోలంకి, కార్తీక్ త్యాగి.
చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు


