దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటలో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన తర్వాత కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించని దురదృష్టవంతుల్లో అమోల్ మజుందార్ పేరు ఉంటుంది. ముంబైకి చెందిన 51 ఏళ్ల మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించాడు. అయితే ఏనాడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు. ఈ దేశవాళీ దిగ్గజం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌లో మర్చిపోలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
రెండేళ్ల క్రితం మహిళల టీమ్‌కు కోచ్‌గా వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో జట్టు ఎంతో రాటుదేలింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలంగా నిలబడిన మజుందార్ జట్టుకు మద్దతుగా నిలుస్తూ తన ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మిన ప్లేయర్లు ఇప్పుడు దానిని నిలబెట్టారు. చాంపియన్‌గా నిలిచి కోచ్‌కు కానుక అందించారు.

ఫైనల్‌కు ముందు వేడుకలతో
వేదికొక్కటే మెరిసింది. స్టేడియం వెలుగుజిలుగుల సవ్వడి చేసింది. పోరు మొదలయ్యాక భారత మహిళల హోరు కొనసాగింది. మ్యాచ్ గెలిచాక... ప్రపంచకప్ చేతికందాక... యావత్ భారతావని పండగ చేసుకుంది.



నడిరాతిరంతా సంతోషాల జాతర చేసుకుంది. తెల్లవారేదాకా ఊరు వాడ తేడానే లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలుపు మురిపెంగా... మూడు రంగుల పతాకాలు, జయజయధ్వానాలే వినిపించాయి. కనిపించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథమహారథులంతా మహిళల విజయాన్ని వేనోళ్ల ప్రశంసలతో ముంచెత్తారు. హర్మన్ సేన పోరాటాన్ని ఆకాశానికెత్తారు.


