ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం | PM Narendra Modi Receives Oman’s Highest Civilian Award; India And Oman Sign Free Trade Agreement | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

Dec 18 2025 7:28 PM | Updated on Dec 18 2025 7:54 PM

India and Oman sign a free trade agreement

మస్కట్: భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను  ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు. భారత్-ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

భారత్–ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.

ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
భారత్-ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

12 బిలియన్ డాలర్ల వాణిజ్యం 
భారత్–ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమాన్, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలక భాగస్వామి. అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసాలు, నౌకాదళ సహకారం మరింత పెరగనున్నాయి.

ఒమన్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాలు, కార్మిక ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి.

అంతకుముందు మస్కట్‌లో ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్‌తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధం మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement