పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం! | Parliament passed SHANTI Bill 2025 Why It Matters | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

Dec 18 2025 7:48 PM | Updated on Dec 18 2025 8:33 PM

Parliament passed SHANTI Bill 2025 Why It Matters

భారత ఇంధన రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (SHANTI) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించింది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అడ్డంకుల తొలగింపు

సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం పాత కాలపు అణు ఇంధన చట్టం (1962), సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010)ను రద్దు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమైన అణు విద్యుత్ ఉత్పత్తి, దాని అనుబంధ కార్యకలాపాలు ఇకపై ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

నిరసన సెగ

మరోవైపు, ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, ఇంజినీర్ల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటీకరణ వల్ల అణు భద్రత, జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమన్వయంతో డిసెంబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

అభ్యంతరం ఎందుకంటే..

రియాక్టర్ సరఫరాదారులను (Supplier Liability) సైతం రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. పరికరాల లోపాల వల్ల ప్రమాదం జరిగితే తయారీదారులను కాపాడి ఆ భారాన్ని ప్రభుత్వం, ప్రజలపై వేసేలా ఈ నిబంధన ఉందని ఏఐపీఈఎఫ్‌ చైర్మన్ శైలేంద్ర దూబే విమర్శించారు.

ప్రధాన డిమాండ్లు

ప్రభుత్వం వెంటనే ‘శాంతి’ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వెళ్లాలనుకుంటే కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు.

  • సప్లయర్‌ లయబిలిటీ నిబంధనలను పునరుద్ధరించాలి.

  • స్వతంత్ర అణు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.

  • పర్యావరణ, కార్మిక రక్షణలను పటిష్టం చేయాలి.

  • విదేశీ భాగస్వామ్యంపై పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలి.

భారతదేశం తన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులు, నిపుణులు మాత్రం తగిన చర్చ లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 23న జరగబోయే నిరసనలు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తాయో వేచి చూడాలి.

ఇదీ చదవండి: టోకనైజేషన్‌ బిల్లు కోసం పార్లమెంట్‌లో డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement