న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన రంగంలో చారిత్రక అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరతీస్తూ ప్రభుత్వం లోక్‌సభలో 'శాంతి' (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) బిల్లు- 2025ను ప్రవేశపెట్టింది. 1962 నాటి పాత చట్టాలను రద్దు చేస్తూ, తీసుకువచ్చిన ఈ బిల్లు, భారతదేశాన్ని గ్లోబల్ న్యూక్లియర్ హబ్‌గా మార్చే దిశగా వేసిన తొలి అడుగు.
ప్రైవేట్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
ఈ బిల్లులోని అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఇకపై టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ వంటి భారతీయ ప్రైవేట్ సంస్థలు సొంతంగా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు.. నిర్వహించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ అధికారం కేవలం ప్రభుత్వ సంస్థలైన ఎన్‌పీసీఐఎల్ వంటి వాటికే పరిమితమై ఉండగా, కొత్త చట్టం ద్వారా ప్రైవేట్ రంగం కూడా ఇందుకోసం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా విదేశీ సంస్థల నియంత్రణలో ఉన్న కంపెనీలకు మాత్రం ఈ అనుమతి ఉండదు.
విదేశీ పెట్టుబడులకు అడ్డంకులు తొలగింపు
గతంలో విదేశీ సరఫరాదారులు భారతదేశంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసేవారు. దానికి ప్రధాన కారణం 'న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010'. ఏదైనా ప్రమాదం జరిగితే పరికరాల సరఫరాదారులపై కూడా బాధ్యత ఉండేది. అయితే ఈ ‘శాంతి’ బిల్లు ఈ అడ్డంకిని తొలగించింది. ఇకపై అణు ఘటనలకు బాధ్యత కేవలం ఆపరేటర్లకే పరిమితం అవుతుంది. సరఫరాదారులకు మినహాయింపు ఉంటుంది. ఇది వెస్టింగ్‌హౌస్, రోసాటమ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు భారతీయ సంస్థలతో చేతులు కలపడానికి మార్గం సుగమం చేస్తుంది.
భద్రత.. కఠిన నిబంధనలు
అణుశక్తి నియంత్రణ బోర్డు (ఏఈఆర్‌బీ)కి ఈ బిల్లు చట్టబద్ధమైన హోదాను కల్పించింది. ఫలితంగా భద్రతా పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్న తప్పులకు రూ. 5 లక్షల నుండి తీవ్రమైన నేరాలకు రూ. ఒక కోటి వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే అణు ప్రమాదాల బాధ్యతను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 300 మిలియన్ల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు (ఎస్‌డీఆర్‌లకు)పరిమితం చేస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా 'అణుశక్తి పరిష్కార సలహా మండలి'ని ఏర్పాటు చేయనున్నారు.
2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యం
ప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం కేవలం 8.2 గిగావాట్లు మాత్రమే. అయితే 2047 నాటికి దీనిని 100 గిగావాట్లకు పెంచాలని, 2070 నాటికి 'నెట్ జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, అణు శాస్త్రంలో ఆవిష్కరణలు, రవాణా, ఇంధన నిల్వ తదితర అంశాలలో కూడా ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..


