కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 58,20,898 మంది ఓటర్ల పేర్లను తొలగింపు కోసం గుర్తించారు. ఇవి ఓటర్ల గణన దశ ముగింపును సూచిస్తాయి. దీని తర్వాత అభ్యంతరాలు, విచారణలతో కూడిన క్లిష్టమైన దశ ప్రారంభమవుతుంది. మూడు దశల ‘సర్’ ప్రక్రియలో రెండవ దశ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా 2026, ఫిబ్రవరి 14న ప్రచురితమవుతుంది.
తొలగింపు కోసం గుర్తించిన 58 లక్షలకు పైగా పేర్ల వివరాలను ఈసీఐ విడుదల చేసింది. వీరిలో అత్యధికంగా 24,16,852 మంది మృతి చెందినట్లు గుర్తించిన ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శాశ్వతంగా వేరే చోటికి మారిన లేదా వలస వెళ్లిన 19,88,076 మంది ఓటర్లు ఉన్నారు. 12,20,038 మంది ఓటర్లు గల్లంతైనట్లుగా గుర్తించగా, 1,38,328 పేర్లను నకిలీ, తప్పుడు లేదా బోగస్ ఎంట్రీలుగా గుర్తించారు. మిగిలిన 57,604 పేర్లను ఇతర కారణాల వల్ల తొలగించాలని ప్రతిపాదించారు. అయితే జాబితా నుండి మినహాయించినవారు సంబంధిత పత్రాలతో పాటు ఫారం 6లో తమ ఫిర్యాదులను సమర్పించుకునే అవకాశం ఉంది.
కాగా ఈ ‘సర్’ ప్రక్రియ రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ‘సర్’ సమయంలో దాదాపు 40 మంది ఎన్నికల అధికారులు మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర పన్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ బయటకు పంపడానికి అనుమతించబోదని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ..మమతా బెనర్జీ ఆగ్రహం అక్రమ వలసదారులతో కూడిన తన ఓటు బ్యాంకును రక్షించుకోవడానికేనని ఆరోపించింది. కాగా బెంగాల్‌తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ‘సర్’ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్.. సోనియా, రాహుల్‌కు ఊరట


