న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన తాజా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జరిపిన దర్యాప్తు.. కొత్తగా నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కాకుండా, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వుల ఆధారంగానే జరిగిందని కోర్టు గమనించింది. అందుకే ఎఫ్‌ఐఆర్ కాపీని పొందే అర్హత ఈ దశలో నిందితులకు లేదని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది.
ఈ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)సోనియా , రాహుల్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ అగ్ర నాయకత్వంపై కేంద్రంలోని మోదీ-షా ద్వయం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా అవాస్తవమని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ వాదించింది.
కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ వాదనలను నిరాధారమని కొట్టిపారేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైనప్పుడు ప్రధాని మోదీ పదవిలో లేరని, ఈ కేసు 2008 నాటిదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు మానుకొని, వారు చేసిన దోపిడీకి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ 120(బి), మోసానికి సంబంధించిన సెక్షన్ 420 కింద ఫిర్యాదులు నమోదయ్యాయని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ కేసు పాతది కాబట్టి దీనిని పాత శిక్షాస్మృతి (పెనల్ కోడ్) కింద నమోదు చేశారని ఆయన తెలియజేశారు. కాగా ఈ కేసులో గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఈడీ తదుపరి దర్యాప్తుకు కోర్టు అనుమతించడం ఉత్కంఠ కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..


