తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్‌గా మార్చేస్తున్నాయి..
ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్‌ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే.
ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్‌గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు.
ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్‌గా అంగీకరించేస్తూ పోతారా?..
ఢిల్లీలోనే ఎందుకంటే..
ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్‌లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్‌ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది.

శాశ్వత పరిష్కారం ఉండవా?
దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు.
పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.
ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్‌పూలింగ్ యాప్‌లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.
అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్‌కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది.


