సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దని అధికార యంత్రాగం జాగ్రత్తలు సూచిస్తోంది.
ఇప్పటికే పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై వరుసగా రెండో రోజు కూడా ప్రభావం పడింది. విజిబులిటీ పడిపోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక్క సోమవారం నాడే 200కి పైగా విమానాలు రద్దయ్యాయి.
AQI(గాల్లో వాయు నాణ్యత) తీవ్రత నిన్న 500 మార్కును దాటింది. అయితే ఈ రోజు ఉదయం నమోదైన డేటా ప్రకారం ఇది సుమారు 370గా ఉంది. లోధి కాలనీ, పూసా రోడ్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో స్థాయిలు సుమారు 350గా నమోదయ్యాయి. కాలుష్య స్థాయిలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, నివాసితులు ఈ సంక్షోభంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులను ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.


