సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూర్‌లను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
బొగ్గు, కట్టెలతో నడిచే తందూర్‌లు ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో వాడకూడదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు Air (Prevention and Control of Pollution) Act, 1981లోని సెక్షన్ 31(A) కింద జారీ అయ్యాయి.
మంగళవారం ఉదయం 10 గంటలకు ఆనంద్ విహార్, ITO ప్రాంతాల్లో AQI 400 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా పరిగణించబడుతుంది. కాలుష్యం తీవ్రత పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) – Stage IV (Severe+) అమల్లోకి వచ్చింది.

బయోమాస్, వ్యర్థాలు లేదా బొగ్గు వంటి పదార్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధం. కాలుష్య స్థాయి ప్రమాదకరంగా పెరగడంతో అన్ని అత్యవసర చర్యలు తక్షణమే అమలు చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) నిర్ణయించింది. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రెస్టారెంట్ వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి.


