వాతావరణ మార్పులతో ప్రపంచ దేశాలన్నీ సతమతమవుతున్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో నాణ్యమైన గాలి, మంచి ఆహారం దొరకడం గగనమైతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 20 లక్షల మంది వరకు చనిపోతున్నారని ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్‌లో ఓ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో వాయు కాలుష్యం కారణంగా మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
నివేదిక ప్రకారం.. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2024 మధ్య భారత్‌లో ఏటా 15 లక్షల నుంచి 20 లక్షల మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో 140 కోట్ల మంది జనాభాలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన ప్రమాణం (ఏడాదికి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములు) కంటే ఎక్కువ పీఎం2.5 వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారని తెలిపింది. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం (ఘనపు మీటరుకు 40 మైక్రాన్లు) కంటే ఎక్కువగా.. వార్షిక సగటు పీఎం2.5 స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశ జనాభాలోని సుమారు 82 శాతం మంది నివసిస్తున్నట్లు పరిశోధన బృందం గుర్తించింది. ఏటా ఈ కాలుష్యం పెరుగుదల 8.6 శాతంగా ఉందని తెలిపింది. ఈ కారణంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్రాల వారీగా ప్రభావం ఇలా.. (2025 AQI డేటా ఆధారంగా)
అధిక ప్రభావం ఉన్న రాష్ట్రాలు / ప్రాంతాలు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్. పంట అవశేషాల దహనం, ట్రాఫిక్, పరిశ్రమల ఎమిషన్స్, కన్‌స్ట్రక్షన్ ధూళి ప్రధాన కారణాలు. ఢిల్లీలో 2023లో జరిగిన మొత్తం మరణాల్లో దాదాపు 15%కి పైగా వాయు కాలుష్యం సంబంధం ఉందని పలు అధ్యయనాలు తెలిపాయి.
మధ్యస్థ ప్రభావం ఉన్న రాష్ట్రాలు
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్ము & కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు).
మెట్రో నగరాలు: ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె ఉన్నాయి. హైదరాబాద్‌లో PM2.5, NO₂ స్థాయిలు WHO గైడ్‌లైన్స్‌ను అధిగమిస్తున్నాయి. ముఖ్యంగా హై ట్రాఫిక్ కారిడార్లు, పరిశ్రమ ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్‌పేట్ వంటి ప్రాంతాలు వాయు కాలుష్యం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేశాయి.
వాయు కాలుష్య కారకాలు..
PM2.5 సూక్ష్మకణాలు: ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి రక్తంలోకి చేరి గుండె, మెదడు మీద ప్రభావం చూపుతాయి. PM2.5 స్థాయిలు WHO సూచించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా 10 ప్రధాన నగరాల్లో కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.
ఓజోన్ (O₃), నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్: ట్రాఫిక్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమల వల్ల వస్తాయి. ఇండోర్ కాలుష్యం: వంట కోసం ఘన ఇంధనాలు (wood, dung, coal) ఉపయోగించే ఇళ్లలో, ఎక్కువగా గ్రామీణ మహిళలు, పిల్లలు ప్రభావితం అవుతున్నారు.
కార్బన్ డయాక్సైడ్: గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది.
కార్బన్ మోనాక్సైడ్: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.
సల్ఫర్‌డయాక్సైడ్: ప్రధానంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.
నైట్రోజన్ ఆక్సైడ్: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్ ఆక్సైడ్ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.
నివారణ పద్ధతులు..
వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.
సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్ లాంటివి వినియోగించాలి.
థర్మల్ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే ఫిల్టర్‌లను తప్పనిసరిగా వాడాలి.
పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్ బూడిద స్లర్రీ వినియోగించాలి.
వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.
ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్‌పీజీ గ్యాస్ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.
రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కంప్రెసర్, నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) హైడ్రోజన్ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలి.
వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్ సింక్ చేయవచ్చని యూఎన్‌ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే ప్రక్రియను కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు.
కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.
వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.
ప్రభుత్వ స్థాయి చర్యలు..
పరిశ్రమల నియంత్రణ
ఎమిషన్ స్టాండర్డ్స్ కఠినతరం చేయడం
కాలుష్య నియంత్రణ పరికరాలు (Electrostatic Precipitators, Scrubbers) తప్పనిసరి
వాహనాల నియంత్రణ
BS-VI నిబంధనలు అమలు
పాత వాహనాల స్క్రాప్ పాలసీ
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విస్తరణ
నిర్మాణ ధూళి నియంత్రణ
రోడ్లపై నీటి పిచికారీ
గ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటు
వ్యక్తిగత స్థాయి చర్యలు..
ప్రయాణ అలవాట్లు మార్చడం
కార్‌పూలింగ్, సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం
ఇంటి వద్ద LPG/PNG లేదా ఇండక్షన్ వంట వాడటం
చెత్త దహనం పూర్తిగా నివారించడం.


