ముందస్తు బెయిల్‌కు ఢిల్లీ కోర్టు తిరస్కృతి
గోవా నైట్‌క్లబ్ భాగస్వామి అజయ్ గుప్తా అరెస్ట్
పనాజీ/న్యూఢిల్లీ: గోవాలో 25 మందిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదానికి కారణమైన నైట్‌క్లబ్ యజమానులు, సౌరభ్, గౌరవ్ లూథ్రాలకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. థాయ్‌లాండ్‌కు చెక్కేసిన ఈ సోదరులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు గట్టిగా నిరాకరించింది. మరోవైపు, ఈ కేసులో వారి వ్యాపార భాగస్వామి అజయ్ గుప్తాను అరెస్ట్ చేశారు. కోర్టులో లూథ్రా సోదరుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వారు పారిపోలేదని, ఒక వ్యాపార సమావేశం కోసమే విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆ క్లబ్‌కు వారు కేవలం లైసెన్స్ హోల్డర్లేనని, అసలు యజమానులు కారన్నారు.
సౌరభ్ లూథ్రా ఏకంగా నాలుగు వారాల పాటు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోరాడు. ‘నేను తిరిగి గోవాకు వస్తే, కోపంతో ఉన్న జనం నన్ను చంపేస్తారు, నా ప్రాణానికి ముప్పు ఉంది’.. అంటూ వాదించాడు. ‘నా మిగతా రెస్టారెంట్లు కూడా నేలమట్టం చేశారు. అధికారులు, చివరికి మీడియా కూడా నా రక్తం తాగడానికి కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు’.. అన్నాడు. అయితే, అడిషనల్ సెషన్స్ జడ్జ్ వందన మాత్రం ఆ వాదనలు తోసిపుచ్చి.. గోవా పోలీసుల స్పందన కోరుతూ కేసును గురువారానికి వాయిదా వేశారు.
ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు
లూథ్రా సోదరులు వేగంగా తప్పించుకోవడానికి సంబంధించి తాజాగా కొత్త వివరాలు బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ వారి కోసం ’బ్లూ కార్నర్ నోటీసు’ కూడా జారీ చేసింది. డిసెంబర్ 7న తెల్లవారుజామున 1.17 గంటలకు, అగి్నప్రమాదం గురించి తెలిసిన గంటలోనే.. లూద్రా సోదరులు ట్రావెల్ పోర్టల్ ద్వారా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఇండిగో విమానంలో దేశం దాటిపోయారు. అప్పటికి ఇంకా పోలీసులు మంటలు ఆర్పే పనిలోనే ఉండటం గమనార్హం.
ఊచల వెనుక సైలెంట్ పార్ట్‌నర్
‘బిర్చ్ బై రోమియో లేన్’నైట్‌క్లబ్‌లో తాను సైలెంట్ పార్టనర్, పెట్టుబడిదారుడినని చెప్పుకొంటున్న అజయ్ గుప్తాను.. గోవా పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో అరెస్ట్ చేశారు. అతనిపై కూడా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యింది. జమ్మూ వాసి అయిన గుప్తాను అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ వినోద్ జోషి ముందు హాజరుపరచగా, అతన్ని గోవాకు తరలించడానికి 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేశారు. ఇండిగో విమానాలు రద్దు కావడం వల్ల ఏర్పడిన ప్రస్తుత విమాన ప్రయాణ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సుదీర్ఘ గడువు ఇచ్చారు.
గుప్తా వెన్నెముక గాయంతో బాధపడుతున్నందున, తరలించేటప్పుడు.. అతనికి సరైన వైద్య సంరక్షణ అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మేనేజర్లు, సిబ్బందిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పనాజీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందుగా భారీగా భద్రతా చర్యలు, తనిఖీలు చేపట్టాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశించారు.
‘డిసెంబర్ 6 సంఘటన నేపథ్యంలో, ఉన్నతాధికారులు, పోలీసు, టూరిజం వాటాదార్లతో సమావేశమయ్యాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగి్నమాపక భద్రతా ఆడిట్ కమిటీ ఇప్పటికే పర్యాటక సంస్థలను తనిఖీ చేయడం మొదలుపెట్టింది. వారు నివేదిక ఇచ్చాక, భద్రతా నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లు రద్దు చేసి, భవనాలను సీల్ చేస్తాం’.. అని సీఎం స్పష్టం చేశారు. పర్యాటక రంగంలో ఉన్నవారు, తమ సిబ్బంది పర్యాటకులతో అనవసరమైన గొడవలకు దిగకుండా చూసుకోవాలని కూడా సావంత్ ఆదేశించారు.


