గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సినిమా లెవల్‌లో సాగిన కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. తీసుకున్న అప్పు కంటే అధిక వడ్డీ కట్టాలని వేధిస్తూ, సౌరభ్ శర్మ అనే యువ హోటల్ మేనేజర్‌ను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారు. వారు అతనిని ఒక గదిలో బంధించి, చిత్రహింసలు పెడుతున్న సమయంలో అతను తన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తనను బంధించిన గదిలో కిడ్నాపర్ మర్చిపోయిన స్మార్ట్‌వాచ్ సౌరభ్ కంటపడింది. అదే అతనికి బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. నిందితులు గమనించకుండా అత్యంత చాకచక్యంగా ఆ వాచ్ ద్వారా తన ప్రియురాలికి ఎమర్జెన్సీ కాల్ చేసి, తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. ఆ ఒక్క కాల్‌తో కథ మొత్తం అడ్డం తిరిగింది.
సౌరభ్ ప్రియురాలు వెంటనే అతడి తండ్రికి సమాచారం ఇవ్వడం, వారు పోలీసులను ఆశ్రయించడంతో సీన్ రివర్స్ అయింది. గ్వాలియర్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి, కిడ్నాపర్లలో ఒకడిని పట్టుకుని విచారించారు. దీంత భయపడిన రెండో నిందితుడు సౌరభ్‌ను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు నిందితులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.
సాంకేతికతను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో ఈ ఘటన నిరూపించింది. "రుణ వివాదంతో మొదలైన ఈ కిడ్నాప్ కేసులో, బాధితుడి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే" అని గ్వాలియర్ పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఈ 'స్మార్ట్' రెస్క్యూ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల సాహసం.. వీడియో వైరల్


