కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు..
బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్‌కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది.
కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది.
#Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z
— Bharathirajan (@bharathircc) December 17, 2025


