కర్నూలు జిల్లా: బాత్‌రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్‌రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు.
బాత్‌రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు.


