మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On Chandrababu Government | Sakshi
Sakshi News home page

మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?: వైఎస్‌ జగన్‌

Jan 31 2026 9:01 PM | Updated on Jan 31 2026 9:18 PM

Ys Jagan Tweet On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును ట్యాగ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు.. ఇప్పుడు  ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్‌రాజ్‌’’గా మారిపోయింది కదా. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబూ.. మీ  ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం.

..తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు.

ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి   నిదర్శనం. ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబుగారూ. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం.

వరుసగా మా పార్టీ సీనియర్‌ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement