గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించినట్లు సమాచారం. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని కేసు రెండు కేసులు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్‌విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు. ఈ రోజు(శనివారం, జనవరి 31వ తేదీ) ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. టీడీపీ మూకలు.. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు.. ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు. ఇదిలా ఉంచితే అంబటి రాంబాబును అరెస్ట్‌కు ముందే రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రాత్రి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అంబటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఉద్రిక్తతల నడుమే అంబటిని అరెస్ట్ చేశారు.
కాగా, అంబటిని హత్య చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.
టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్‌సెట్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.

ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే పొద్దున్నుంచీ ఇలా హైడ్రామా నడిపిన కూటమి ప్రభుత్వం.. చివరకు అంబటిని అక్రమంగా అరెస్ట్ చేయించింది.
అసలేం జరిగిందంటే..
తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు.
అయితే.. గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు . అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్‌చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై దాడికి యత్నించే సమయంలో పోలీసులు చోద్యం చూశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అయితే రాత్రి సమయంలో అంబటి ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.. అంబటిని గుంటూరు నివాసంలోనే అరెస్ట్ చేశారు.


